ప్యాన్ ఇండియన్ సూపర్‌స్టార్ ప్రభాస్. మర్యాదపురుషోత్తముడు శ్రీరాముడి కథలో రాఘవుడిగా నటిస్తున్నారు ప్రభాస్. ఆయన సరసన జానకీమాతగా నటిస్తున్నారు కృతిసనన్. లంకేశ్వరుడిగా మెప్పించనున్నారు సైఫ్ అలీఖాన్. ఈ సినిమాను ఓమ్ రవుత్ తెరకెక్కిస్తున్నారు. టీసీరీస్ భూషణ్ కుమార్ నిర్మాతల్లో ఒకరు. ఈ సినిమాను ఈ వేసవి దాటాక విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఓం రవుత్, నిర్మాత భూషణ్ కుమార్ కలిసి వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ఈ ఇద్దరూ వెళ్లి మాతను సందర్శించుకున్నారు. త్వరలోనే చిత్రం ప్రమోషన్లను మొదలుపెట్టాలన్నది కోరిక. జమ్ము కాశ్మీర్‌లోని వైష్ణో దేవి కోవెల అంటే ఓం రవుత్‌కి చాలా సెంటిమెంట్ అట.
ఆయన మాట్లాడుతూ ``చైత్ర నవరాత్రి సందర్భంగా తల్లిని సందర్శించుకోవడం ఆనందంగా ఉంది. హైందవ ధర్మం ప్రకారం ఈ సమయంలో తల్లి ఆశీస్సులు పొందడం అదృష్టం. మేం ప్రస్తుతం రామాయణకాలాన్ని రీ క్రియేట్ చేసే పనుల్లో ఉన్నాం. దీనికి దుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్నాం. గుల్షన్ కుమార్‌కి కూడా చాలా మంచి విశ్వాసం ఉంటుంది తల్లిమీద. అందుకే ఆశీస్సులు తీసుకున్నాం`` అని అన్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది ఆదిపురుష్. ఈ సినిమా గురించి కృతి మాట్లాడుతూ `` ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీలవుతున్నాం. ఈ సినిమా చేసినందుకు మేం ఎంత గర్వపడుతున్నామో, ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుని సహానుభూతి చెందుతారని ఆశిస్తున్నాం. ఆదిపురుష్ మా దృష్టిలో కేవలం సినిమా మాత్రమే కాదు, అంతకు మించి. పిల్లలకు మంచి ఎడ్యుకేషనల్ ఫిల్మ్ అవుతుంది. ఈ తరం పిల్లలు కూడా తప్పక చూడాల్సిన సినిమా ఇది. జూన్ 16న విడుదల కానుంది ఆదిపురుష్`` అని అన్నారు.